Saturday, March 5, 2011

ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ధామస్ నియామకాన్ని రద్దుచేసిన సుప్రీం కోర్టు


ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ధామస్ నియామకాన్ని రద్దుచేసిన సుప్రీం కోర్టు

PJThomas-CVC
సి.వి.సిగా ధామస్ పదవీ ప్రమాణ స్వీకారం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ హెచ్ కపాడియా ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా పి.జె.ధామస్ నియామకాన్ని రద్ధు చేస్తూ తీర్పునిచ్చారు. కేరళలొ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉండగా 1992లో పామాయిల్ ను అధిక ధరలకు దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న పి.జె.ధామస్ ను సి.వి.సి గా నియమించడం చెల్లదని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ “సుప్రీం తీర్పు ప్రధానికీ, ఆయన ప్రభుత్వానికీ పెద్ద దెబ్బ” అని పేర్కొంది. సి.వి.సి ప్రతిష్ట సుప్రీం తీర్పుతో తిరిగి ప్రతిష్టించబడింది అని కూడా తెలిపింది.
అనేక అవినీతి ఆరోపణలతో ఇప్పటికే అప్రతిష్ట పాలయిన కేంద్ర ప్రభుత్వానికి ఇది కోలుకోలేని దెబ్బ. బలహీన ప్రధానిగా పలుసార్లు విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని మన్మోహన్ సింగ్ కు వ్యక్తిగతంగా ఇది ఇబ్బందిని కలిగించే తీర్పు. 1,76,000 కోట్ల విలువగల అతిపెద్ద కుంభకోణానికి సంబంధించి సహచర మంత్రిని నియంత్రించడంలో విఫలమైన ప్రధానిగా ఇప్పటికే మన్మోహన్ సింగ్ ఒక అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. గత సంవత్సరం సి.వి.సి నియామకాన్ని ప్రధాని బహిరంగంగా సమర్ధించుకున్నాడు. పైగా అవినీతి విషయంలో రాజీ పడేది లేదని ఇటీవల ప్రధాని ఘనంగా చాటుకున్నారు కూడా. సి.వి.సి నియామకంపై సుప్రీం తీర్పును ప్రధాని ఎలా ఎదుర్కుంటారో చూడాల్సిందే.
పి.జె.ధామస్ ఎదుర్కొంటున్న ఆరోపణల సంగతి సి.వి.సి ని నియమించిన హైపవర్ కమిటీకి తెలియదని సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ముగ్గురు సభ్యులు ఉండే హై పవర్ కమిటీలో ప్రతిపక్ష పార్టీ తరపున బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ నిజానికి నియామకం సమయం లోనే ఆరోపణల రీత్యా అభ్యంతరం వ్యక్త చేసిన సంగతిని మాత్రం కోర్టుకు చెప్పలేదు. ఈ తీర్పుతో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంగాలూ అవినీతితో భ్రష్టుపట్టినట్లయ్యింది.
సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్ గా పని చేస్తున్న ప్రశాంత్ భూషణ్ గత సంవత్సరం “స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వారిలో సగం మంది అవినీతిపరులేన”ని ఆరోపించి సంచలనం సృష్టించారు. తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయనీ కోర్టు ధిక్కారం క్రింద తనను కావాలంటే అరెస్టు చేసుకోవచ్చని కూడా ఆయన సవాలు విసిరారు. కానీ ప్రభుత్వం తరపున గానీ, కోర్టు తరపున గానీ ఎవరూ స్పందించిన పాపాన పోలేదు. చెప్పొచ్చేదేమంటే దేశ అత్యున్నత న్యాయ స్ధానం సైతం అవినీతి బురదలో మునిగి తేలిందని.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్.కాపాడియా ప్రభుత్వ అవినీతి పరులను సాధ్యమైనంత వరకూ చట్టం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ భూషణ్ హెచ్.ఎం.టీ.వీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సి.బి.ఐని కేంద్ర ప్రభుత్వ ప్రభావంనుండి బయటకు తెచ్చి సుప్రీం కోర్టుకు బాధ్యురాలుగా తయారు చేయటానికి ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ అధి సాధ్యం కావటం లేదనీ, సి.బి.ఐ అధికారుల నియామకం ప్రభుత్వం చేతిలో ఉండటమే దానికి కారణమనీ ఆయన తెలిపారు.
భారత ఆహార సంస్ధ గిడ్డంగుల్లో ఖాళీ లేక ఆరుబయట నిలవ ఉంచడం వలన ఆహార ధాన్యాలు కుళ్ళిపోతుండటంతో వాటిని పేదలకు ఉచితంగా పంచాలని సుప్రీం కోర్టు గత సంవత్సరం కోరితే కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. సుప్రీం కోర్టు చివాట్లు పెట్టడంతో ప్రధాని మన్మోహన్ సింగ్ “ప్రభుత్వ నిర్ణయాధికారాల్లొ కోర్టులు జోక్యం చేసుకోజాలవని సిద్ధాంతం వల్లించాడు. కోర్టులు జోక్యం చేసుకునే స్ధితికి ప్రభుత్వమే తెచ్చుకుంటున్న విషయం తాజా తీర్పుతోనయినా ప్రధానికి అర్ధం అయిందో లేదో మరి!

No comments:

Post a Comment