బలహీన పడుతున్న గడ్డాఫీ, వదిలి వెళ్తున్న మద్దతుదారులు
42 సంవత్సరాల నుండి లిబియాను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కల్నల్ మహమ్మద్ గడ్డాఫీని మద్దతుదారులు ఒక్కొక్కరు వదిలి ఆందోళనకారులకు మద్దతు తెలుపుతుండడంతో క్రమంగా బలహీన పడుతున్నాడు. రెండు తెగలు కూడా ఆందోళనకారులకు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులపై హింసను ప్రయోగించడాన్ని ఆ తెగల పెద్దలు తప్పు పట్టారు. లిబియాలో అది పెద్ద తెగ “వార్ఫ్లా” కూడా ఆ తెగల్లో ఉండటం గమనార్హం. లిబియా తరపున ఇండియా కు రాయబారిగా ఉన్న అలీ అల్-ఎస్సావీ భద్రతా దళాల దాడులను, కాల్పులను ఖండించడంతో ప్రభుత్వంలో విభేదాలు బైట పడ్డాయి.
లిబియా తరపున అరబ్ లీగ్ కు రాయబారిగా ఉన్న ఆబ్దెల్ మొనీమ్ అల్-హోనీ, తాను విప్లవం చేరుతున్నట్లు ప్రకటించాడు. కొంతమంది సైనికులు సైతం గడ్డాఫీ పట్ల విధేయతను వదిలేసి ఆందోళనకారుల్లో చేరిపోయారు. సైన్యంపై నమ్మకం లేక గడ్డాఫీ ప్రభుత్వం విదేశాలనుండి అద్దెకు సాయుధులను రప్పించినట్లు వార్తలు వచ్చాయి. ఆందోళనకారులకు మద్దతు తెలిపిన ఇండియాలోని లిబియా రాయబారి విదేశాలనుండి సాయుధులను రప్పించడాన్ని తీవ్రంగా ఖండించడాన్ని బట్టి అది నిజమేనని స్పష్టమయ్యింది.
గడ్డాఫీ ప్రభుత్వానికి ప్రధాన ప్రతినిధిగా వ్యవహరిస్తూ వచ్చిన మహమ్మద్ బాయోవ్, ప్రభుత్వం ఆందోళనకారులను హింస జరుగుతుందంటూ హెచ్చరించడం సరైంది కాదని ప్రకటించి తాను కూడా ఆందోళనకారుల వైపేనని పరోక్షంగా తెలియ జేశాడు. లిబియాలో ప్రజామోదం పొందిన ప్రతిపక్షం ఉందన్న సంగతి గడ్డాఫీ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని బాయోవ్ కోరాడు. వారితో చర్చలు జరపడం ఉత్తమమని సూచించాడు. గడ్డాఫీ, రాజధాని ట్రిపోలీని వదిలి తన సొంత పట్టణానికి వెళ్ళినట్లుగా పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.
రెండో పెద్ద పట్టణం ‘బెంఘాజీ’ ఇప్పటికే ఆందోళనకారుల వశంలో ఉంది. సాయుధులైన యువకులు పట్టణంలో గస్తీ నిర్వహిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. రాజధాని ట్రిపోలీలో కూడా వేలమంది గడ్డాఫీ దిగిపోవాలంటూ ఆదివారం సాయంత్రం ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు భవనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ట్రిపోలీలోని గ్రీన్ స్క్వేర్ వద్ద గడ్డాఫీ మద్దతుదారులు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం గ్రీన స్క్వేర్ వద్ద ప్రదర్శన నిర్వహిస్తున్న ఆందోళనకారులపై సైన్యం, పోలీసులు కాల్పులు జరిపారు. డజన్ల సంఖ్యలో ఆందోళనకారులు చనిపోయారనీ, సైన్యం హత్యాకాండకు పాల్పడిందని బిబిసి తెలిపింది. కాల్పులతో ఆందోళనకారులు చెల్లాచెదురు అయిన అనంతరం గ్రీన్ స్క్వేర్ ను గడ్డాఫీ మద్దతుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే దేశంలోని తూర్పు ప్రాంతంలో పరిస్ధితులు గడ్డాఫీకి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయి. తూర్పు భాగంలో గడ్డాఫీకి మొదటినుండీ పట్టు తక్కువ. బెంఘాజీ తూర్పు ప్రాంతంలోనే ఉంది.

No comments:
Post a Comment