“మల్లెల విప్లవం” నేపధ్యంలో దేశ వ్యాపిత “డేటాబేస్” నిర్వహణకై చైనా అధికారి సూచన
అరబ్ ప్రజా ఉద్యమాల స్ఫూర్తితో చైనాలో క్రితం వారం ఇంటర్నెట్ ద్వారా అటువంటి ప్రదర్శనను నిర్వహించాలంటూ ప్రచారం జరిగిన నేపధ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఝౌ యాంగ్ కాంగ్ హెచ్చరించాదు. పొలిట్ బ్యూరోలో ఝౌ, చట్ట పాలనకు (లా అండ్ ఆర్డర్) భాద్యుడు. సామాజిక వ్యవస్ధ నిర్వహణ పట్ల జాగ్రత్త వహించాలనీ సమాజంలో సంఘర్షణలను, సమస్యలను ముందే గుర్తించాలనీ ఆయన సీనియర్ అధికారులను కోరినట్లుగా అధికార వార్తా పత్రిక “జిన్ హువా” తెలిపింది. వారంతపు సెమినార్ లో ప్రసంగిస్తూ ఆయన ఈ విధంగా కోరాడు.
ఇంటర్నెట్ ప్రచారానికి స్పందించి ప్రదర్శన కోసం గుమికూడిన వారిని పోలీసులు అక్కడినుంచి పంపించివేశారు. షాంఘై లో పోలీసులు ముగ్గురిని నిర్బంధంలోకి తీసుకున్నారు. మానవ హక్కుల కార్యకర్తలను, లాయర్లను ప్రదర్శన సమయానికి ముందే అరెస్ట్ చేశారు. కానీ ప్రజా ప్రదర్శనకు ఇచ్చిన పిలుపు ప్రజలెవరూ పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. పోలీసులు అతిగా స్పందించారని పరిశీలకులు భావిస్తున్నారు.
చైనా ప్రజలందరికి సంబంధించిన అన్ని వివరాలతో ప్రభుత్వం డేటాబేస్ ఏర్పాటు చేయాలని ఝౌ సెమినార్ లో అధికారులకు సూచించినట్లుగా పత్రిక తెలిపింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇటువంటి డేటా బేస్ ను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాయి. దేశ జనాభాలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలతో పాటు అతని/ఆమె అలవాట్లు, ప్రవర్తన, ఆరోగ్యం, వ్యాపకాలు, రాజకీయ విధేయత, ఆర్ధిక స్ధితిగతులు మొదలైనవన్నీ ఈ డేటా బేస్ లో భద్రపరుస్తారు. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వాలకు ఎదురయ్యే రాజకీయ సవాళ్ళు, ప్రజా తిరుగుబాట్లు, ఆందోళనలు, అల్లర్లు మొదలైన వాటికి ఎవరు పాత్రధారులుగా, నాయకులుగా ఉంటారో ముందే తెలుసుకొని ఉండే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి.
ఇండియాలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన “యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ” (ఆధార్) కార్డు కూడా ఈ కోవలోనిదే. ఇది ప్రభుత్వ పధకాలు అందరికీ చేరటానికి ఉపయోగ పడుతుందనీ, రక రకాల కార్డులు భద్ర పరచుకునే అవసరం లేకుండా అన్ని అవసరాలకు ఉపయోగపడేలా ఉంటుందనీ ప్రభుత్వం చెపుతున్నప్పటికీ అసలు ఉద్దేశం ప్రజల నుండి తమకు ఎదురయ్యే సమస్యలను ముందే తెలుసుకొని విరుగుడు చర్యలను ముందే తీసుకోవటానికి సిద్ధంగా ఉండాలని. ఇటువంటి డేటా బేస్ అంతిమంగా ప్రజల ప్రాధమిక హక్కుల హరించేవిగా తయారవుతాయి. ప్రజల రోజువారి కార్యకలాపాల మీద నిఘా తీవ్రమౌతుంది.

No comments:
Post a Comment