కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఇండియా అప్పు రూ. 4.5 ట్రిలియన్లు -రాయిటర్స్ సర్వే
రానున్న ఆర్ధిక సంవత్సరంలో (2011-12) 4.5 ట్రిలియన్ల రూపాయల (4.5 లక్షల కోట్ల రూపాయలు) అప్పును ఇండియా సేకరించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్ధ సర్వేలో తేలింది. ఇది 99.3 బిలియన్ల డాలర్లకు (99,300 కోట్ల రూపాయలు) సమానం. ప్రభుత్వాలు “సావరిన్ డెట్ బాండ్లు” జారీ చేయటం ద్వారా అప్పును సేకరిస్తాయి. వివిధ ఫైనాన్షియల్ (ద్రవ్య) కంపెనీలు, ఆర్ధిక రేటింగ్ కంపెనీలు, విశ్లేషణా సంస్ధలు, అర్ధిక మేధావులు మొదలైన వారిని వార్తా సంస్ధలు సర్వే చేసి వివరాలను క్రోడీకరించి సర్వే ఫలితాలను వెల్లడిస్తాయి. ద్రవ్య, ఆర్ధిక వార్తలను అందించే వార్తా సంస్ధలు ప్రధానంగా ఇటువంటి సర్వేలు చేపడతాయి. తర్వాత అసలు గణాంకాలు కూడా ఈ ఫలితాలకు కొంత అటు ఇటుగా ఉంటాయి. అంతే కాకుండా మార్కెట్ లోని ప్రధాన పాత్రదారుల అవసరాలను తెలుసుకోడానికి ప్రభుత్వం లోని విధాన రూపకర్తలు ఇటువంటి సర్వేల పైన ఆధార పడతారు. అంతర్జాతీయ ప్రైవేటు ద్రవ్య కంపెనీలు ఇటువంటి సర్వే ఫలితాల ద్వారా భవిష్యత్తులోని వ్యాపార అవకాశాలను తెలుసుకొని తదనుగుణంగా పధకాలను రూపొందించుకుంటాయి. అంతర్జాతీయ ఆర్ధిక వార్తా సంస్ధలు, రేటింగ్ సంస్ధలు ఇటువంటి సర్వేలను చేపడుతుంటాయి. భారత దేశానికి సంబంధించిన సర్వేలను రాయిటర్స్ వార్తా సంస్ధ క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. ఫిబ్రవరి నెలాఖరున భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా రాయిటర్స్ సంస్ధ సర్వే జరిపి ఫలితాలను ఈ రోజు వెల్లడించింది. సర్వే ప్రకారం భారత ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు సేకరించే లక్ష్యం పెట్టుకోవచ్చు. రాయిటర్స్ సంస్ధ సర్వే కోసం మార్కెట్ లోని 25 ముఖ్యమైన సంస్ధలనుండి అంచనాలను సేకరించింది. అంతర్జాతీయ ఆర్ధిక, ద్రవ్య మార్కెట్లలోని పాత్ర ధారులు బడ్జెట్ ప్రకటనలో అప్పు లక్ష్యం ఎంత అనేదానిపై ఆధారపది ఇండియాతో జరిపే వ్యాపారానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కోశాగార లోటు లక్ష్యం (బడ్జెట్ లో అంచనా వేసిన ఆదాయం కంటే అసలు ఆదాయం తక్కువగా ఉంటుంది. రెండింతి మధ్య తేడాను కోశాగార లోటు (ఫిస్కల్ డెఫిసిట్) అంటారు. దీనిని బడ్జెట్ లోటు అని కూడా అంటారు), పన్నుల ఆదాయం అంచనా, సబ్సిడీల అంచనా, ప్రభుత్వరంగ కంపెనీల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మొదలైన వివరాల పైన కూడా మార్కెట్ పాత్రధారులు, పరిశీలకులు, విశ్లేషకులు బడ్జెట్ ప్రకటనలో కేంద్రీకరిస్తారు.
కోశాగార లోటు ఎంత తక్కువగా లక్ష్యంగా పెట్టుకుంటే అంతగా ఇండియా మార్కెట్ పట్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఆకర్షితులవుతారు. తక్కువ కోశాగార లోటు అంటే లక్ష్యంగా పెట్టుకుంటే ఆర్ధిక క్రమ శిక్షణ పాటించనున్నారని అర్ధం చేసుకుంటారు. లక్ష్యాలతో పాటు వాటిని చేరుకోవటంలో గత చరిత్రను కూడా వారు దృష్టిలో పెట్టుకుంటారు. ఇండియాకు సంబంధించి లక్ష్యం విధించుకోవడంలో ఉన్న సిన్సియారిటీ దాన్ని చేరుకోవటంలో ఉండదన్న చెడ్డ పేరే ఇండియా పాలకులు సంపాదించుకున్నారు. ప్రభుత్వరంగ కంపెనీల అమ్మకం ద్వారా వచ్చే అదాయాన్ని ఎక్కువగా చూపినట్లయితే మార్కెట్ ఎకానమీ వైపుకు వడివడిగా అడుగులు వేయటానికి ప్రభుత్వం నిర్ణయించుకుందని చెప్పుకోవచ్చు. తద్వారా విదేశీ పెట్టుబడుదారులు ఎక్కువమంది ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. సబ్సిడీ ఖర్చు తక్కువగా ఉండాలని ఎఫ్.డి.ఐ లు కోరుకుంటాయి. మొత్తం మీద సంక్షేమం ఖాతా కింద తక్కువ ఖర్చు పెట్టాలని కూడా అవి కోరుకుంటాయి.
2010-11 ఆర్ధిక సంవత్సరానికి కోశాగార లోటు జి.డి.పిలో 5.5 శాతం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. అంటే 2011 మార్చి 31 నాటికి ఫిస్కల్ డెఫిసిట్ జి.డి.పిలో 5.5 శాతం ఉండాలి. ఆ లక్ష్యం కంటే ఇంకా తక్కువే ఉండవచ్చని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 3-జి వేలం ద్వారా లక్షకోట్ల రూపాయల ఆదాయం సమకూరడంతో అది సాధ్యపడుతుందని భావిస్తున్నారు. 2011-12 సంవత్సరానికి గానూ 4.8 శాతం ఫిస్కల్ డెఫిసిట్ ను లక్ష్యంగా ఇండియా గతంలోనే నిర్నయించింది. రానున్న బడ్జెట్ లో కూడా అంతే లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఆయిల్ ధరలు పెరుగుతుండటం, ఆహార సబ్సిడీ పెరగడం వలన రానున్న ఆర్ధిక సంవత్సరంలో కోశాగార లోటు లక్ష్యం కష్టం కావచ్చని పరిశీలకుల అంచనా.
2011-12 లో అప్పు 4.5 ట్రిలియన్ రూపాయలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే షేర్ మార్కెట్లు మార్చి ఆఖరులోపు పెద్దగా పెరక్క పోవచ్చని అంటున్నారు. 2010 డిసెంబరు దాకా పైపైకి దూసుకు పోయిన షేర్లు 2011 లో పది శాతం పైనే (2,000 పాయింట్లు) పడిపోయాయి. కొత్త సంవత్సరంలో ప్రపంచంలోని ప్రధాన మార్కెట్లన్నింటిలో ఇండియా షేర్ మార్కెట్లే దారుణంగా పడిపోయాయి. ఇండియా పోటీదారులైన ఇతర ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ దేశాల్లో పరిస్ధితి మెరుగ్గానే ఉంది. నష్టపోయిన చోట్ల చాలా తక్కువ నష్టం జరిగింది. మిగిలిన చోట్ల షేర్లు లాభాల్లో ఉన్నాయి. రానున్న ఆర్ధిక సంవత్సరంలో ఇండియా ఆర్ధిక పరిస్ధితి బలహీనంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య సంస్ధ “క్రెడిట్ సుసీ” తెలిపింది.
No comments:
Post a Comment